
Single Movie Review in Telugu
నటీనటులు: శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్ దర్శకుడు: కార్తీక్ రాజు నిర్మాత: అల్లు అరవింద్ జానర్: కామెడీ, రొమాన్స్ విడుదల తేదీ: మే 9, 2025
సాధారణంగా ప్రేమకథలు ఫీల్ గుడ్ మూవీస్, లేదా ఎమోషనల్ కనెక్టివిటీతో ఉంటాయి. ఈ రెండు కాకుండా కామెడీనే బేస్ చేసుకొని నడిచే మూడవరకం లవ్ స్టోరీ ఈ "సింగల్" సినిమా. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ సినిమా మే 9న థియేటర్లలో ప్రెకషకుల ముందుకు వచ్చింది. ఎలా ఉందో ఈ రివ్యూ లో చూద్దాం.
కథ:
విజయ్ (శ్రీవిష్ణు) మరియు అరవింద్ (వెన్నెల కిషోర్)లు ఇద్దరు సింగిల్ ఫ్రెండ్స్ తమ జీవితంలో సరదాగా, కామెడీతో గడుపుతూ ఉంటారు. విజయ్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేస్తుంటాడు. ఎవరో ఒక అమ్మాయిని లవ్ లో పడేసి సింగిల్ కార్డ్‌కి ఫుల్‌స్టాఫ్ పెట్టాలని విజయ్ కోరిక.
ఒకరోజు మెట్రో రైలులో పూర్వ (కేతికా శర్మ)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఆడికార్ల కంపెనీలో పనిచేస్తుంది. ప్రేమ కోసం హీరో కారు కొనేవాడిలా పరిచయం చేసుకుంటాడు. మరోవైపు హరిణి (ఇవానా) హీరోని ఇష్టపడుతూ ఉంటుంది. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటానని అబద్ధం చెప్పి హీరోకి దగ్గరవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. పూర్వ వెంట విజయ్ పడటం, విజయ్ వెంట హరిణి పడటం, హాస్యంతో సాగే ఈ ముక్కోణపు ప్రేమ ఎన్ని మలుపులు తిరిగిందనేదే మిగిలిన కథ.
విశ్లేషణ:
ఎంతోకాలం నుంచి వింటున్న సాధారణమైన ముక్కోణపు ప్రేమకథే ఈ సినిమాలోనూ కనిపించే ప్రధానకథ. అయితే కథ పాతదే అయినా దానిని చూపించటంలో కొత్తదనం కనిపిస్తుంది. పూర్తిగా శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ ల కామెడీ టైమింగ్ అలరిస్తుంది. సినిమా మొత్తం వీళ్లిద్దరి భుజాలపైనే నడుస్తుంది. హీరోలని అనుకరిస్తూ విష్ణు చెప్పే డైలాగులు ఈ సినిమా ప్రత్యేకం. డైలాగులు చాలా వరకూ కొత్తగా, క్యాచీగా ఉంటాయి. నవ్వులు పండిస్తాయి.
అయితే ఈ ముక్కోణపు ప్రేమకథలో కొత్త పాత్రలు, సన్నివేశాలు వేరే ఏమీ లేకపోవటం, కొత్త లొకేషన్స్ కూడా ఏమీ కనిపించకపోవడం వలన కథ ముందుకు వెళ్లట్లేదనే భావన కలుగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా పాతదే, ఎక్కడో చూసిందే.
కామెడీ సన్నివేశాలు ఉన్నప్పటికీ, రెండవ భాగంలో కథ డ్రాగ్ అవుతుంది. మొదటి భాగంలో సరదాగా కనిపించే హీరో రెండవ భాగంలో ఉన్నట్టుండి ఎమోషనల్ గా కనిపించటం సెట్ కాలేదు. భావోద్వేగ సన్నివేశాలు అంతగా కనెక్ట్ కావు. సెకండాఫ్‌లో రాజేంద్రప్రసాద్ సబ్‌ప్లాట్ అనవసరం అనిపిస్తుంది.
హీరోయిన్లు కేతిక శర్మ, ఇవానా పాత్రలు పెద్దగా ఆకట్టుకోలేదు. కేతిక శర్మ పాత్ర బలహీనంగా రాసినట్లు అనిపిస్తుంది, ఇవానా కూడా సరిగ్గా ఇమ్పాక్ట్ చూపలేకపోయింది.
నిర్మాణ విలువలు పూర్‌గా ఉన్నాయి. సంగీతం, కెమెరా, జస్ట్ ఓకే. దర్శకుడు కార్తిక్ రాజ్ కథని కంటే కేవలం డైలాగుల్ని నమ్ముకుని సినిమా తీసినట్లుగా ఉంది. కామెడీకి బాగానే రాసుకున్నారు కాబట్టి, కథనంలో కనీస జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం దక్కేది.
చివరిగా:
"సింగిల్" ఒక సగటు కామెడీ ఎంటర్‌టైనర్, శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్‌ల కామెడీని ఆస్వాదించాలనుకునే వారికి ఒకసారి చూడదగిన చిత్రం. అయితే, గొప్ప అంచనాలు పెట్టుకోకుండా చూస్తేనే ఆనందించగలరు.