రంగమార్తాండ తెలుగు మూవీ రివ్యూ


Rangamarthanda Movie Telugu Review

నటీనటులు: ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ, ఆలీ రెజా తదితరులు. సంగీత దర్శకులు: ఇళయరాజా సినిమాటోగ్రఫీ: రాజ్ కె నల్లి ఎడిటర్: పవన్ వికె దర్శకుడు : కృష్ణవంశీ నిర్మాతలు: కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి విడుదల తేదీ: 22 మార్చ్ 2023. రేటింగ్: 3/5

చాలా రోజుల గ్యాప్ తరువాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారు తెరకెక్కించిన ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ రంగమార్తాండ. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ యొక్క టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకొని సినిమా పై పెద్ద అంచనాలు ఏర్పరిచాయి.

ఎన్నో క్లాసిక్ సినిమాలకి, ఫ్యామిలీ సినిమాలకి దర్శకత్వం వహించిన కృష్ణవంశీ గారు చాలా గ్యాప్ తర్వాత తీసిన సినిమా ఇది, మధ్యలో కొన్ని ప్లాప్ సినిమాలు వచ్చినా ఆయన క్రేజ్ మాత్రం తగ్గలేదు, ఆరేళ్ల తర్వాత ఇపుడు ఈ రంగమార్తాండ సినిమాతో ముందుకొచ్చాడు.

అయితే ఈ సారి ఒక రీమేక్ తో వచ్చారు, మరాఠీలో "నట సామ్రాట్ " పేరుతో విడుదలై హిట్టైన చిత్రమిది. అక్కడ నానాపటేకర్ గారు నటవిశ్వరూపం చూపిస్తే ఇక్కడ ప్రకాశ్ రాజ్ గారు తన నటన విశ్వ రూపాన్ని చూపారు.

కథ :

రాఘవరావు (ప్రకాష్ రాజ్) తన వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకున్న రంగస్థల నటుడు. నాటక రంగంలో ఆయన చేసిన కృషికి,నాటక రంగమే తన జీవితంగా బతికిన రాఘవ రావుకి రంగ మార్తాండ బిరుదుని ప్రధానం చేస్తారు, రాఘవరావుకి వయసు మీదపడుతున్నకొద్దీ అతను తన వృత్తి నుండి రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకుని తన ఆస్తిని తన పిల్లలకి ఇచ్చి రంగస్థలం నుంచి నిష్క్రమిస్తాడు. అనంతరం అతడు, తన భార్య రాజు గారు (రమ్య కృష్ణన్) ఇద్దరూ తమ పిల్లలు శ్రీ (శివాత్మిక రాజశేఖర్) మరియు రంగా (ఆదర్శ్ బాలకృష్ణ) వల్ల ఎన్నో మాటలు పడతారు. కాగా రంగమార్తాండ రాఘవరావు, ఆయన పిల్లల మధ్య జరిగే ఎమోషనల్ డ్రామానే మిగతా కథ.

పిల్లలకి ఆస్తి రాసిచ్చేసి ప్రశాంతంగా వాళ్ల నీడలో బతుకుదామనుకున్న ఆత్మాభిమానంగల ఒక నటుడు ఎదుర్కునే కష్టాలు, పడే బాధలు ఈ సినిమాలోని కథ. రంగస్థలం మీద ఎన్నో పాత్రలు చేసిన రాఘవరావుకి నిజ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, నాటక రంగంలో గెలిచినా రాఘవ రావు నిజ జీవితంలో గెలిచాడా లేదా లేదా అనేది ఈ కథ.

నిజానికి మరాఠి సినిమా రీమేక్ అయినప్పటికీ కృష్ణ వంశీ తనకు తగ్గట్టు కొంత మార్పులను, తెలుగుదనాన్ని, కొత్తదనాన్ని, పాత్రలను, భావోద్వేగాలను చూపించారు. రాఘవ రావు తన రంగస్థలం మీద నటించిన జీవితం ఒక వైపు, నటన తర్వాత తన ఇంట్లో నిజ జీవితంలో జరిగే సంఘర్షణలు ఒక వైపు, ఇలా తన జీవితంలోని రెండు భాగాలను స్క్రీన్ మీద ప్రెసెంట్ చేసాడు.

నటి - నటుల సాంకేతిక వర్గం పని తీరు :

ఇందులో ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, బ్రహ్మానందం ఈ ముగ్గురు ప్రధాన పాత్రధారులు, నటనలోనే విలక్షణ నటులు ఐన ప్రకాష్ రాజ్ గారు & రమ్య కృష్ణ గారిని తీసుకోవడం అభినందనీయం, అలాగే హాస్య బ్రహ్మ ఐన బ్రహ్మానందం గారిని ఇలాంటి పాత్రలో చూపించడం గొప్ప ప్రయత్నం.

ఇందులో నటన గురించి చెప్పాలంటే ప్రకాశ్ రాజ్ అద్భుతమనిపించాడు. ఆయన తన కెరీర్ లో చేసిన కొన్ని గొప్ప పాత్రల్లో ఇదొకటి అనొచ్చు, బాగా బతికిన వాడిగా, చితికిపోయిన వాడిగా, ఆత్మాభిమానం కలవాడిగా, దానిని చంపేసుకున్నవాడిలా, కోపం - బాధ ఇలా అన్నిరకాల అభినయాలతో నిజంగా రంగ మార్తాండ అనిపించుకున్నాడు.

ఇందులో బ్రహ్మానందం చేసిన పాత్ర, మరాఠీ చిత్రంలో విక్రం గోఖలే చేసిన పాత్రకు ఇంకొంత ఇంటెన్సిటీ కలిపి ఉంటుంది, ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన నటన ఆయన సొంతం. రమ్యకృష్ణ క్యారెక్టర్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది, సెకండ్ హాఫ్ కొన్ని సీన్స్ లో కొంత ఎమోషనల్ ఉన్నప్పటికీ చాలా వరకు సీన్స్ కళ్ళతో హావభావాలతో కూడిన నటన. శివాత్మికా రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్, అనసూయ తమ తమ పాత్రల వరకు పర్లేదు, జయలలితది బహ్మానందం భార్యగా చిన్న పాత్ర, కాకపోతే కృష్ణవంశీ గారి దర్శకత్వంలో ప్రతి పాత్రకి ఒక గుర్తింపు మరియు ఒక ఎమోషన్ ఉంటుంది, అలా అన్ని పాత్రలు ప్రాధాన్యమైనవే.

ఇక సంగీతం విషయానికొస్తే ఇళయరాజా గారి సంగీతం ప్రశాంతంగా, మనసుగా హాయిగా అనిపిస్తుంది, సందర్భానుసారంగా వచ్చే బాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే సిరివెన్నెల గారి సాహిత్యం అద్భుతం. అలాగే ఆకెళ్ళ శివ ప్రసాద్ రాసిన డైలాగ్స్ ఎంతో ఆకట్టుకుంటాయి. రాజ్ కె నల్లి సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ గాని సినిమా నిర్మాణ విలువలు అన్ని బాగున్నాయి.

ఇక ఫైనల్ గా దర్శకుడు కృష్ణవంశి తన ప్రతిభకి తగ్గట్టుగా గొప్ప సినిమాని అందించారు, డబ్బింగ్ సినిమా అయినప్పటికీ తన టేకింగ్ గాని, అనుభవం కానీ ఖచ్చితంగా కనిపిస్తుంది.

మన మధ్య ఉన్న పాత్రలని స్క్రీన్ మీద చూసినట్టు, ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఎమోషనల్ డ్రామా బాగా కనెక్ట్ అవుతుంది. నేటితరం జీవితాల్ని కళ్ళకు కట్టినట్టు చూపించే సినిమా, అలాగే ఇప్పటి కంటెంట్ మాత్రమే నచ్చే జనాలకు నచ్చని సినిమా, కనెక్ట్ అయ్యే వారికి మాత్రం కంటతడి పెట్టించే సినిమా.

సంబంధిత కథనాలు (Related Articles)

ఎక్కువ మంది చదివినవి (Most Read)


Please Support