
Balagam Telugu Movie Review
నటీనటులు : ప్రియదర్శి , కావ్య కల్యాణ్ రామ్, టిల్లు వేణు, రచ్చ రవి, సత్యం, మురళీధర్ తదితరులు దర్శకత్వం : వేణు (టిల్లు) మ్యూజిక్ : బీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫి : ఆచార్య వేణు బ్యానర్ : దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మాతలు : హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి రిలీజ్ డేట్ : 03 మార్చి 2023 సినిమా వ్యవధి : 02:11గం.లు
కొత్త కథలను, న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేయటానికి ఆసక్తి చూపించే నిర్మాత దిల్ రాజు గారు తన ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించారు. ఒక చిన్న కమెడియన్ గా తన కెరీర్ ని మొదలు పెట్టిన వేణు, జబర్దస్త్ ద్వారా జనాలకు దగ్గర అయ్యి, ఇప్పుడు ఒక దర్శకుడిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వేణు తన "బలగం"తో తన బలం నిరూపించుకుంటాడో లేదో తెలియాలంటే కథలోకి వెళ్లి చూడాల్సిందే.
గాజుల కొమురయ్య (సుధాకర్ రెడ్డి) పైకి సంతోషంగా కనిపించినా జీవితంలో ఏదో తెలియని బాధ, ఒకరోజు ఉన్నట్టుండి కొమురయ్య చనిపోతాడు. కొమురయ్యకు ఇద్దరు కొడుకులు ఐలయ్య, మొగిలయ్య, ఒక కుమార్తె లక్ష్మి ఉంటారు. లక్ష్మి భర్త నారాయణతో ఐలయ్య, మొగిలయ్యలు ఇరవై ఏళ్ల క్రితం చిన్న గొడవ పడతారు. అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య మాటలుండవు. కానీ తండ్రి మరణ వార్తతో అందరు కలిసి తండ్రికి అంత్యక్రియలు జరుపుతారు.
తర్వాత కర్మకాండల సమయంలో కాకులకు పెట్టే ముద్దలను కాకి ముట్టనే ముట్టదు, అసలు కాకులు ఎందుకలా చేస్తున్నాయో ఎవరికీ అర్థం కాదు.
కొమురయ్య మనుమడు సాయిలు (ప్రియదర్శి)కి అప్పులు ఉంటాయి. పెళ్లి చేసుకొని వచ్చిన కట్నంతో అప్పులు తీర్చాలని సాయిలు ఆలోచన. అదే టైం లో తాత చనిపోవడంతో సాయిలుకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.
సాయిలుకి తన మేనమామ నారాయణకి చాలా ఆస్తులున్నాయని తెలుస్తుంది. దాంతో ఆయన కూతురు సంధ్య (కావ్యా కళ్యాణ్ రామ్)ని ప్రేమలో దించే ప్రయత్నం చేస్తాడు. అసలు సాయిలుకి అప్పులు ఎందుకు అయ్యాయి,తన తాత ఎందుకు చనిపోయాడు, అయితే కొమురయ్య మరణం తర్వాత మూడొద్దులు, ఐదొద్దులు సమయంలో పిండాలను పిట్ట ఎందుకు ముట్టలేదు? రెండు కుటుంబాల మధ్య అసలు గొడవలేంటి, రెండు కుటుంబాలు మళ్ళీ కలుస్తాయా లేదా అనేదే ఈ "బలగం" కథ.
అన్ని రకాల క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల సినిమా స్లోగా స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. కనుకయ్య ఆకస్మిక మరణంతో మనవడు సాయిలుకు రకరకాల కష్టాలు తెచ్చిపెడుతుంది. తెలంగాణలోని పల్లెటూళ్లో మనుషుల మధ్య బంధాలు, గొడవలను, భావోద్వేగాలను ప్రధానంగా చేసుకుని 'బలగం' సినిమాను రూపొందించాడు దర్శకుడు వేణు. స్వతహాగా తెలంగాణ వాడు అవడం వల్ల కొంత లాభం అని అనుకోవచ్చు. ఈ మధ్య తెలుగు సినిమాల్లో తెలంగాణ యాస, ప్రాంతాలను, వాడుకుంటూ సినిమాను సక్సెస్ చేసుకునే ప్రయత్నాలు అయితే బాగానే జరుగుతున్నాయి. ఇక్కడ ఇది పక్కా తెలంగాణ సినిమా.
కుటుంబాల మధ్య గొడవలు వాటిని హీరో లేదా ఏదైనా కుటుంబ సభ్యులు సరి చేసి అందరినీ కలిపే కథాంశంతో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఇక్కడ చావు తర్వాత అంశాలతో కథను నడిపించాడు దర్శకుడు వేణు, ఇలా చావు తర్వాత కుటుంబ సభ్యుల మధ్య కలిగే ఎమోషన్స్, అలాగే ఊర్లో వాళ్లు రెస్పాండ్ అయ్యే విధానాన్ని చక్కగా చూపించారు. కొత్తగా దర్శకత్వం వహిస్తున్నాకూడా వేణు తెలంగాణ ఎమోషన్స్ ని, యాస ని చక్కగా జనాల్లోకి తీసుకెళ్ల గలిగాడు.
కమర్షియల్ హీరో లేకున్నా, భారీ సెట్స్ లేకున్నా, భారీ ఫైట్స్ లేకున్నా ఈ సినిమాని చక్కగా నిర్మించారు. తన వారసులైన హర్షిత్ రెడ్డి, హన్షితలను నిర్మాతలుగా 'బలగం' సినిమాను నిర్మించారు నిర్మాత దిల్ రాజు.
డైరెక్టర్‌గా మొదటి సినిమా అయినప్పటికీ వేణు సినిమా కోసం ఎంత కష్టపడ్డాడనేది స్క్రీన్‌పై కనిపిస్తుంది. సినిమాలో ఎమోషన్స్ ని క్యారీ చేయడమే కష్టమైనా పని, దానికి తగ్గ క్యారెక్టర్స్ ఎంచుకోవడం, ఇలా ప్రతి అంశంలోనూ వేణు సక్సెస్ అయ్యాడు. ఇక రచ్చ రవి మరోసారి కథను మలుపు తిప్పే పాత్రలో కనిపించాడు.
భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు, నేపథ్య సంగీతం బావున్నాయి, అలాగే తెలంగాణ బుర్ర కథని దర్శకుడు కొంత వాడుకున్నాడు. క్లైమాక్స్‌లో వేణు పాడిన పాట ప్రతీ ప్రేక్షకుడిని కంటతడి పెట్టించేలా ఉంటుంది. రామ్ మిరియాల పాడిన పాటలు కూడా అద్బుతంగా ఉన్నాయి. ఆచార్య వేణు సినిమాటోగ్రఫీ బావుంది.
ఈ సినిమాకు తాత పాత్రధారి కొమురయ్యగా నటించిన సుధాకర్ రెడ్డి గారు హీరో అనుకోవాలి. ఎందుకంటే ఈయన క్యారెక్టర్ చుట్టూనే కథ నడుస్తుంది. ఇక ప్రియదర్శి & కావ్య కళ్యాణ్ రామ్ తమ పాత్రలను చక్కగా చేసారు. క్లైమాక్స్ లో ప్రియదర్శి ఎమోషనల్ సీన్ అద్భుతం అని చెప్పాలి. ఇంతే కాక మిగిలిన పాత్రధారులు తమ తమ పాత్రలలో ఒదిగిపోయారు. చాలా వరకు రియలిస్టిక్ గా అనిపిస్తాయి పాత్రలు అన్నీ.
తెలంగాణలోని మనుషుల ఎమోషన్స్‌ను చెప్పే సినిమా బలగం. తెలంగాణలోని ప్రతీ గ్రామంలో చావు సమయంలో ఆచరించే సంప్రదాయాలు, సంస్కృతి కళ్లకు కట్టినట్టుగా సజీవంగా తెరపైన కనిపిస్తాయి. సినిమా చూసినంత సేపు సినిమాని కాకుండా కొన్ని జీవితాలను నేరుగా చూసిన అనుభూతి కలుగుతుంది. ఆంధ్ర వాళ్లకు సినిమా నేటివిటీ కనెక్ట్ అవుతుందో లేదో చెప్పలేను కానీ ఎమోషన్స్ మాత్రం అందరికి కనెక్ట్ అవుతాయి.
తప్పకుండా మన బలగంతోపాటు వెళ్లి చూడదగిన సినిమా ఈ "బలగం".