దసరా తెలుగు సినిమా రివ్యూ | Dasara Movie Review


Dasara Movie Review

చిత్రం: దసరా తారాగణం: నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, సాయికుమార్, షైన్ టామ్ చాకో, సముద్రఖని, పూర్ణ తదితరులు. కెమెరా: సత్యన్ సూరన్ ఎడిటర్: నవీన్ నూలి సంగీతం: సంతోష్ నారాయణన్ దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల నిర్మాత: సుధాకర్ చెరుకూరి విడుదల: మార్చ్ 30, 2023.

ఈ మధ్య టాలీవుడ్ మొత్తం కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుడుతున్నారు, కథ లో బలం ఉంటె ప్రేక్షకులు తప్పకుండ ఆదరిస్తారు అనే నమ్మకంతో కొత్త దర్శకులతో సినిమాలు చేస్తున్నారు, అలాగే మన నాచురల్ స్టార్ నాని కూడా ఈ మధ్య కొత్త వాళ్లకు అవకాశం ఇస్తూ సినిమాలు తీస్తున్నాడు. డైరెక్టర్ శ్రీకాంత్ గారు సుకుమార్ గారి దగ్గర అసిస్టెంట్ గా చేసిన వ్యక్తి, జగడం సినిమా నుండి మొన్నటి రంగస్థలం వరకు పని చేసిన వ్యక్తి, ఆ అనుభవంతోని ఒక స్టార్ హీరోని సినిమా ఒప్పించి తీయడం నిజంగా గొప్ప విషయమే, అలాగే సినిమా విడుదలకి ముందే చమ్కీల ఆంగి లాంటి పాటతో మరియు ట్రైలర్ తో సినిమా మీద ఒక హోప్ కలిపించారు ప్రేక్షకులకి. డీగ్లామర్ రోల్ తో పాటు ఫుల్ మాస్ లుక్ తో ఉంది సినిమా.

కథ :

ఇక కథలోకి వెళ్తే వీర్లపల్లి అనే ఊరిలో బొగ్గుగనుల నేపథ్యంలో కథ ఓపెన్ అవుతుంది. అక్కడ ధరణి (నాని), సూరి (దీక్షిత్ శెట్టి), వెన్నెల (కీర్తి సురేష్) స్నేహితులు. రైళ్లలో బొగ్గు దొంగతనం చేయడం రోజు తాగడం కలిసి తిరగడం వీళ్ళ దినచర్య. స్థానిక రాజకీయ నాయకులు వాళ్ల జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు, తన స్నేహితుడు సూరి కోసం తన ప్రేమని కూడా త్యాగం చేసిన వాడు ధరణి, అలాగే లోకల్ పాలిటిక్స్ వల్ల వీళ్ళ జీవితాలు ఎలా మలుపు తిరిగాయి అన్నదే ఈ కథ, పోస్టర్ కథ చెప్పాలి అంటే సీత కోసం రావణుడిని సంహరించిన రాముడి కథ అన్న మాట.

నటీ - నటులు & సాంకేతిక వర్గం పని తీరు :

తెలంగాణలోని వీర్లపల్లి అనే గ్రామంలో బొగ్గు గని నేపథ్యంలో సాగే కథ ఇది, నాతో పాటు చూసే ప్రతి ప్రేక్షకుడికి ఇది కొంత రంగస్థలం కథలా అనిపిస్తుంది, మనది ఐన పల్లెటూరు జీవన నేపథ్యాన్ని కొందరి కథల్ని సహజంగా చూపించే ప్రయత్నం అయితే జరిగింది.

కొత్త కథ అయితే కాదు కానీ ఉన్న కథని ప్రేక్షకుడికి దగ్గర అయ్యేలా చూపించడంలో గొప్ప ప్రయత్నం జరిగింది. స్నేహం మరియు ప్రేమ అలాగే త్యాగాన్ని కలిపి చూపించారు సినిమా మొదటిలోనే, ఆ తర్వాత కొంత పల్లెటూరు రాజకీయాల్ని చూపించారు, నాని ఇంట్రడక్షన్ సీన్ నుండి సినిమా కొంత వేగం పుంజుకుంటుంది, ఇంట్రో సీన్ బొగ్గు దొంగతనం చేసే సీన్ మాత్రం అద్భుతం.

హీరో నానికి ఈ పాత్ర కొత్త అయినప్పటికీ తనదైన శైలిలో ప్రతిభని చూపించాడు. నాచురల్ స్టార్ అనే పేరుకి న్యాయం గట్టిగానే చేసాడు. హీరో ఫ్రెండ్ గా చేసిన కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, తన పాత్రకి న్యాయం చేసాడు, అలాగే విలన్ గా మళయాళ నటుడు టామ్ చాకో కూడా బాగానే చేసాడు. ఈ మాత్రం నటన చూపగలిగేవాళ్లు తెలుగులో కూడా చాలామంది ఉన్నారు, వివిధ భాష నటుల్ని తీసుకుంటే అన్ని భాషల్లో చూస్తారు అనే ఆలోచనతో తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది, అంతా పాన్ ఇండియా ఎఫెక్ట్!

కీర్తి సురేష్ వెన్నెల పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది, గతంలో ఈ తరహా పాత్రలు చేసిన హీరోయిన్స్ కంటే గొప్పగా చేసిందనిపించింది. సాయికుమార్ పాత్ర నిడివి ఉన్నంతలో పర్వాలేదు. సముద్రఖనికి చిన్న నిడివి ఉన్న పాత్ర ఇచ్చారు, ఝాన్సి తన పాత్ర చక్కగా చేసింది. క్యారెక్టర్ యాక్టర్ గా ఈవిడకు ఇంకొన్ని అవకాశాలు ఇస్తే బాగుంటుంది.

సత్యన్ సూరన్ కెమెరా వర్క్ బాగుంది, ఈ సినిమాకి హైలైట్ ఏమిటంటే bgm, సంతోష్ నారాయణన్ bgm సాధారణ కథని కూడా పై స్థాయిలో నిలబెట్టిన ఘనత ఈ డిపార్ట్మెంటుదే. చమ్కీల అంగిలేసి పాటతో సినిమా థియేటర్ వరకు ప్రేక్షకుడిని తీసుకొచ్చాడు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకి మొదటి సినిమా అయినప్పటికీ ఈ చిత్రాన్ని చాలా చక్కగా తీసాడు, చాలా క్వాలిటీ ఔట్ పుట్ ని అందించాడు, మాటలు బాగున్నాయి.

ఫైనల్ గా దసరా సినిమా గురించి చెప్పాలి అంటే ఇంటర్వెల్ ముందు వరకు స్నేహం, ప్రేమ, విలేజి స్టైల్ పాలిటిక్స్ తో కొంత రంగస్థలంని గుర్తు చేస్తే, ఇంటర్వెల్ ముందు సీన్ నుండి అసలైన దసరా మొదలవుతుంది, కథ మామూలుదే అయినా దర్శకుడు తీసిన స్టైల్ కి ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.

పక్కా నాటు పల్లెటూరి కథ అనుకోవచ్చు, తెలంగాణ దసరా పండగ లాంటి నాటు సినిమా.

రేటింగ్ : 3.25 / 5.0

సంబంధిత కథనాలు (Related Articles)

ఎక్కువ మంది చదివినవి (Most Read)


Please Support