రివ్యూ : పులి మేక (వెబ్ సిరీస్)


Puli Meka Web Series Review

నటీనటులు : లావణ్యా త్రిపాఠి, ఆది సాయి కుమార్, సుమన్, సిరి హనుమంతు, గోపరాజు రమణ, తదితరులు రచన : కోన వెంకట్, వెంకటేష్ కిలారు సినిమాటోగ్రఫీ : రామ్ కె. మహేష్ సంగీతం : ప్రవీణ్ లక్కరాజు దర్శకత్వం : చక్రవర్తి రెడ్డి .కె విడుదల తేదీ: ఫిబ్రవరి 24, 2023 ఓటీటీ వేదిక : జీ5 ఎపిసోడ్స్ : 8

ఇదొక రొటీన్‌ కమర్షియల్ థ్రిల్లర్, రొటీన్ సినిమాని వెబ్ సిరీస్ లా చూడడమే.

హీరోయిన్ లావణ్యా త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'పులి మేక' (Puli Meka Web Series). ఇందులో ఆమెకు జోడిగా ఆది సాయి కుమార్ నటించారు. ప్రముఖ రచయిత కోన వెంకట్ రచన, నిర్మాణ భాగస్వామ్యంలో రూపొందింది. ఈ సిరీస్ ఎలా ఉంది అంటే.

కథ : హైదరాబాద్ లోని పలువురు పోలీస్ ఆఫీసర్లని ఒక సీరియల్ కిల్లర్ ఒకరి తరువాత మరొకరిని హత్యచేస్తూ ఉంటాడు, కిరణ్ ప్రభ (లావణ్యా త్రిపాఠి) ఐపీఎస్ ఆఫీసర్, కమిషనర్ అనురాగ్ నారాయణ్ (సుమన్) కు ఉన్న నమ్మకం వల్ల కిరణ్ ప్రభకు ఈ కేసును అప్పగిస్తాడు. అయితే తన టీమ్ తో కలిసి ఆమె ఇన్వెస్టిగేషన్ సమయంలో ఆమెకు ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేసే ప్రభాకర్ శర్మ (ఆది సాయి కుమార్) సహాయం చేస్తుంటాడు. మొదట ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ మరియు ఒక డాక్టర్ హత్యకు గురి అవుతారు, ఆ తర్వాత వచ్చిన లావణ్య త్రిపాఠి వరుస హత్యలు చేస్తున్న కిల్లర్ ని పట్టుకుంటుందా, అసలు ఆ కిల్లర్ ఎవరు??? వరుసగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లనే ఎందుకు చంపుతున్నారు? ఇవన్నీ తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.

విశ్లేషణ : ఈ కథ నిజానికి సినిమా స్టోరీ, ఇక్కడ ఇదే స్టోరీని వెబ్ సిరీస్ లాగా తీశారు, అంతే కాకుండా ఇది ఫిమేల్ ఓరియెంటెడ్ కథ. లావణ్య లీడ్ రోల్ లో మరియు ఆది సాయికుమార్ తొలి సారి వెబ్ సిరీస్ లో నటించారు. కిరణ్ ప్రభ పాత్రలో లావణ్య త్రిపాఠి నటన అద్భుతం అనే చెప్పాలి, కొన్ని సన్నివేశాల్లో ఆమె చేసిన స్టంట్స్ అలాగే పండించిన ఎమోషన్స్ ఎంతో ఆకట్టుకుంటాయి, హీరోయిన్ గా లావణ్య కి ఇది బెస్ట్ రోల్ అని చెప్పొచ్చు, అలాగే హైదరాబాద్ బోనాల జాతర సీన్ లో లావణ్య మహంకాళి వేషధారణ అద్భుతం అనేలా ఉంది. మొత్తానికి సీరియస్ పాత్ర అయినప్పటికీ చిన్న చిన్న గ్లామర్ టచ్ ఇస్తూ చక్కగా డిజైన్ చేసారు లావణ్య క్యారెక్టర్ ని.

ఇక చాలా రోజుల తరువాత ఆది సాయి కుమార్ మంచి పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలో నటించారు. తనకు తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నప్పటికీ కూడా పాత్ర యొక్క పరిధి మేరకు ఆది చక్కగా పెర్ఫార్మ్ చేసారు అని చెప్పాలి. ఇలాంటి కొత్త తరహా పాత్రలు చేస్తూ ఉంటె ఆదికి మరిన్ని ఛాన్స్ లు రావడం పక్కా. ఈ సిరీస్ లో పల్లవి పాత్రలో నటించిన సిరి హనుమంతు తన పాత్రకు న్యాయం చేసింది, ఆమె కనబరిచిన నటన, ఎమోషన్స్ బాగున్నాయి. సీనియర్ యాక్టర్ సుమన్ కూడా పోలీస్ పాత్రలో ఆకట్టుకున్నారు, అలాగే గోపరాజు రమణ, ముక్కు అవినాష్, మయాంక్ తదితరులు తమ తమ పరిధి మేరకు నటించారు.

ప్రవీణ్ లక్కరాజు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది, కొన్ని సీన్స్ లో వచ్చే బీజీఎమ్ ఆడియన్స్ ని ఎంతో అలరిస్తుంది, అంతే కాకుండా ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ కి బాక్గ్రౌండ్ స్కోర్ చాలా చాలా ముఖ్యమైనది. ఇక రామ్ కె మహేష్ సినిమాటోగ్రఫి కూడా బాగుంది, సినిమా స్టోరీని సిరీస్ లా తీయడం వల్ల కొంత ఎడిటింగ్ & స్క్రీన్ ప్లే తప్పులు ఉన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే కోన వెంకట్ మరియు వెంకటేష్ కిలారు బాగా రాసుకున్నారు ఈ కథని. దర్శకుడు చక్రవర్తి విషయానికి వస్తే, అతను సిరీస్‌తో ఓకే ఓకే అనిపించాడు.

క్రైమ్ థ్రిల్లర్ గా మన ముందుకు తెచ్చిన "పులి-మేక" ఓవరాల్ గా ఆడియన్స్ ని తప్పకుండా ఆకట్టుకుంటుంది, ఫిమేల్ లీడ్ లావణ్య త్రిపాఠి కొంత ప్లస్ అవుతుంది. ట్విస్టులతో కూడిన థ్రిల్లర్ సినిమా అవ్వడం వల్ల ఆడియన్స్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు.ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కూడా వీకెండ్ లో హ్యాపీగా చూడొచ్చు.

సంబంధిత కథనాలు (Related Articles)

ఎక్కువ మంది చదివినవి (Most Read)


Please Support