ఆదిపురుష్ (adipurush review) మూవీ రివ్యూ


Adipurush Review Telugu

నటీనటులు: ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్,సన్నీ సింగ్,దేవదత్త నాగె తదితరులు. సంగీతం: అజయ్ అతుల్ ఛాయాగ్రహణం: కార్తీక్ పళని స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఓం రౌత్ నిర్మాతలు: భూషణ్ కుమార్-కృషన్ కుమార్-ఓం రౌత్-ప్రసాద్ సుతార్-రాజేష్ నాయర్

"ఆదిపురుష్" భారతీయ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన చిత్రం. రామాయణానికి మోడర్న్ వెర్షన్, టీజర్ వల్ల నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఆ తర్వాత ట్రైలర్ రిలీజ్ అయ్యాక మంచి టాక్ తో జూన్ 16 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాల్మీకి రచించిన రామాయణం భారతీయుల జీవితాలలో ఇమిడి పోయిన ఒక అద్భుత కావ్యం, ఇలాంటి ఒక సబ్జెక్టుతో సినిమా తీస్తున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా తీయాలి, ఇంతకు ముందు ఎన్నో సినిమాలు వచ్చి ప్రేక్షకులను కనువిందు చేసాయి. చూద్దాం, ఈ సినిమా ఎంత వరకు జనాల్లోకి వెళ్తుందో!

ఇది కేవలం దర్శకుడు ఓం రావత్ ఊహాజనిత రామాయణం మాత్రమే, ఇప్పటి వారికి రామాయణం అంటే తెలియక పోతే దయచేసి వాల్మీకి రామాయణం బుక్ చదివి తెలుసుకోగలరు.

కథ:

వాల్మీకి రచించిన రామాయణం నుండి కొన్ని ఘట్టాల్ని తీసుకొని రూపొందించిన చిత్రమిది. రాముడి వనవాసంతో మొదలయిన ఈ చిత్రం, తనను వలచిన శూర్పనఖను రాముడు తిరస్కరించడం, అయినా రాముడిపై మోహం తగ్గని ఆమెకు లక్ష్మణుడు బుద్ధి చెప్పి పంపడం, చెల్లికి జరిగిన అవమానానికి ప్రతిగా జానకిని రావణుడు ఎత్తుకెళ్ళడం, ఆపై సుగ్రీవుడు-ఆంజనేయుల అండతో రాముడు లంకపైకి దండెత్తి రావణుడిని సంహరించి జానకిని తన వెంట తీసుకురావడం ఇది క్లుప్తంగా ఆదిపురుష్ సినిమా.

తండ్రి మాటకి కట్టుబడి రాఘవుడు (ప్రభాస్) తన సతీమణి జానకి(కృతి సనన్)తో కలిసి వనవాసానికి బయలుదేరడంతో ఈ కథ మొదలవుతుంది, వీరితో కలిసి రాఘవుడి సోదరుడు అయిన శేషు (సన్నీ సింగ్) కూడా అడవి బాట పడతారు, ఒక లంకాధిపతి రావణ్ (సైఫ్ అలీ ఖాన్) సోదరి అయిన శూర్పణఖ రాఘవుడిని చూసి మనసు పడుతుంది, స్వతహాగా రాఘవుడు ఏక పత్ని వ్రతుడు, ఈ క్రమంలో శేషు శూర్పణఖ ముక్కు చెవులు కోస్తాడు. ఆ తర్వాత శూర్పణఖ మాటలు విని లంకాధిపతి ఐన రావణుడు సీతని అపహరిస్తాడు, తన రాజ్యంలోని అశోక వనంలో బంధిస్తాడు, ఆ తర్వాత రాఘవుడు జానకి కోసం పడిన కష్టాలు ఏంటి? ఆయనకు భజరంగి (దేవదత్త నాగ్) ఎలా సహాయ పడ్డాడు? చివరకు రాఘవుడు లంకేశుడిని ఎలా జయించి జానకిని తీసుకొచ్చాడు అనేది మిగిలిన కథ.

ఎలా ఉందంటే:

ఈ తరం ప్రేక్షకులకి గొప్ప గొప్ప విజువల్స్ మరియు గ్రాఫిక్స్ ఉంటె చాలు అనే ఉద్దేశ్యంతో దర్శకుడు రామాయణ ఘట్టాలను తీసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు, కథను పక్కన పెట్టి విజువల్స్ మీద మాత్రమే దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది, కొన్ని కథలని టచ్ చేయొద్దు, పాడు చేయొద్దు. ఇక్కడ దర్శకుడు స్టోరీ ఫ్రీడమ్ తీసుకొని తనకి నచ్చినట్టు తీసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. చివరికి క్యారెక్టర్స్ పేర్లతో సహా, (నాకు తెలిసినంత వరకు అందరు పిలిచే పేర్లు అయితే రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు/ఆంజనేయుడు మరియు రావణుడు) రాఘవుడు అని పేరు పెట్టి చివరకు జై శ్రీరామ్ అని స్లొగన్స్ ఇస్తారు వాళ్ళే. ముందు ఐన చెప్పి ఉండాల్సింది ఇది వాల్మీకి విరచిత రామాయణం కాదు అని.

ఇక పోతే విజువల్స్ పరంగా చూస్తే బాగానే ఉంది అని అనిపిస్తుంది కానీ ఇలాంటి టెక్నాలజీ లేని రోజుల్లోనే ఇంత కంటే గొప్పగా రామాయణాన్ని చూపించారు మన వాళ్ళు! క్లుప్తంగా చెప్పాలి అంటే వాళ్ళు తీసిన సినిమా ఇంత కంటే గొప్పగా ఉంది అని చెప్పొచ్చు. రావణుడు అమరత్వం కోసం దీక్ష చేయడం, బ్రహ్మ ప్రత్యక్షమై వరం ప్రసాదించడంతో కథ మొదలవుతుంది. రావణుడు జానకిని ఎత్తుకెళ్ళడంతో అసలు కథ మొదలవుతుంది, ఆ తరువాత రాఘవుడు జానకి కోసం వెతుక్కుంటూ వెళ్లడం, వాలి సుగ్రీవుల యుద్ధం, జటాయువుతో రావణుడి పోరాటం, ఇలా ఫస్ట్ హాఫ్ సాగుతుంది. సెకండ్ హాఫ్ కి వస్తే రామసేతు నిర్మాణంతో మొదలయ్యి రావణుడు మూర్ఛ పోవడంతో భజరంగ్ సంజీవని పర్వతాన్ని ఎత్తుకు రావడం, రావణుడి కొడుకు అయినటువంటి ఇంద్రజిత్ తో పోరాటం, అలాగే రాఘవ-రావణుడి మధ్య యుద్ధ సన్నివేశాలు, ఇలా సినిమా సాగుతుంది. విజువల్స్ ని ఎక్కువగా నమ్ముకొని సినిమా తీయడం వల్ల ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేరు! అసలే నాచురల్ గా ఉండాల్సిన కథని, సినిమాని ఈ VFX చెడగొట్టింది అనే చెప్పొచ్చు.

నటి నటులు - సాంకేతిక వర్గం పనితీరు:

రాఘవుడిగా ప్రభాస్ తన వరకు న్యాయం చేసాడు, కానీ ఇప్పటి వరకు ఎక్కడ చూడని విధంగా రాముడిని చూపించారు, రాముడు అంటే అలాగే ఉండాలి అనే వారికి నేను విభేదించలేను కానీ రాముడు అలా ఉంటేనే బాగుంది అనిపించింది, అందం, ఆహార్యం విషయంలో మాత్రం ప్రభాస్ లో రాముడిని చూడొచ్చు, ఇక జానకిగా కృతి సనన్ చాలా బాగుంది, అభినయం విషయం పక్కన పెడితే అందంలో లోటు లేదు. రావణ్ గా సైఫ్ అలీఖాన్ ఒదిగిపోయాడు, కాకపోతే దర్శకుడు ఈ పాత్రని చెడకొట్టాడు అనడంలో సందేహమే లేదు! ఇక ఈ సినిమా మొత్తంలో బెస్ట్ అంటే భజరంగి పాత్రలో చేసిన దేవ్ దత్త నాగే! ఈ పాత్రకి ఉన్న ఎలివేషన్ సీన్స్ మాత్రం బాగున్నాయి! శేషు గా సన్నీ సింగ్ పాత్ర పర్వాలేదు.

ఇక సాంకేతిక పరంగా చూసుకుంటే కార్తీక్ పాలని సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక విజువల్స్ అయితే చెప్పక్కర్లేదు, ఎంత వరకు ప్లస్ అయిందో అంత వరకు మైనస్ కూడా. ఈ విజువల్స్ తో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ల్స్ కి గురి అవుతున్నారు పాపం. హాలీవుడ్ మూవీలోని అస్గర్డ్ కోటని తీసుకొచ్చి రావణుడి లంకగా చూపించడం మాత్రం హైలైట్ అసలు, ఇక రావణుడి పది తలలు చూసే విధానము, ఇలా చెప్పుకుంటే ఎన్నో ఎన్నెన్నో. అలాగే ఉండాలా అంటే నేను ఉండాలి అన్నాను, కానీ ఆలా ఉంటేనే బాగుంటుంది అన్నది నిజం. ఇక ఈ సినిమాలో అన్నిటి కంటే బాగుంది అంటే అది కేవలం మ్యూజిక్ మాత్రమే, అజయ్-అతుల్ మ్యూజిక్ చాలా ప్లస్ పాయింట్ ఈ సినిమాకి, సాంగ్స్ మాత్రమే కాకుండా బాక్గ్రౌండ్ స్కోర్ అదిరి పోయింది.

ఇక ఫైనల్ గా మూల కర్త దర్శకుడు ఓం రావత్, ప్రాచీన ఇతిహాసాలను తీసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీయాలి అన్న విషయం మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు తీస్తా అంటే కుదరదు.పేర్లు కొత్తగా, కథ కొత్తగా, అసహజంగా, కృత్రిమంగా ఇలా ఇష్టం వచ్చినట్టు తీసాడు.

పౌరాణికాల విషయానికి వస్తే, పెద్దగా టెక్నాలజీ లేని రోజుల్లోనే వాటిని అత్యద్భుతంగా తీర్చిదిద్ది ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఘనత ఒకప్పటి దర్శకులకు చెందుతుంది. అంతంతమాత్రం టెక్నాలజీతోనే అప్పటి దర్శకులు అద్భుతాలు చేస్తే, ఇప్పుడున్న సాంకేతికతను వాడుకుని 'ఆదిపురుష్'ను అత్యున్నత స్థాయిలో నిలబెట్టడానికి ఓం రౌత్ కు అవకాశం దక్కింది. కానీ అతను మాత్రం 'ఆదిపురుష్'ను చెడగొట్టడానికే టెక్నాలజీని వాడుకున్నాడు.

చివరగా:

రామాయణం అనే ఒక్క విషయం పక్కకి పెడితే ప్రేక్షకులకి ఒక పెద్ద పరీక్ష ఈ సినిమా చూడడం, మాకు మా హీరో కావాలి, విజువల్స్ మాత్రమే ఎంజాయ్ చేస్తాం అనే వాళ్ళు హ్యాపీగా వెళ్లి సినిమా చూడొచ్చు, కానీ ఇదే రామాయణం అని మాత్రం భ్రమలో బ్రతకకండి!

మీ పిల్లలకి రామాయణాన్ని చదివి వినిపించండి, ఇలాంటి సినిమాల ద్వారా మాత్రం కాదు. ఇక్కడ నేను ఎవరిని కించ పరచాలనే ఉద్దేశ్యం నాకు లేదు, ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటె క్షమించండి, కానీ నేను రాసిన ప్రతి మాట నిజం, అక్షర సత్యం.

Rating : 2.0 / 5.0

సంబంధిత కథనాలు (Related Articles)

ఎక్కువ మంది చదివినవి (Most Read)


Please Support